జగిత్యాల ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు, కండక్టర్ల సమస్యలపై హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా పరిశీలన
జగిత్యాల జిల్లా ప్రతినిధి అర్జున్ సమాచారం సెప్టెంబర్ 3::
డ్రైవర్లు, కండక్టర్ల సమస్యలను పరిష్కరించాలి – ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి
జగిత్యాల: హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ కొండల రాజేందర్ కుమార్ ఆధ్వర్యంలో జగిత్యాల ఆర్టీసీ డిపోను సందర్శించి డిపో మేనేజర్‌ను కలిసి సన్మానించారు. అనంతరం డిపోలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లతో సమావేశమై వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డ్రైవర్లు, కండక్టర్లు తమ విధుల్లో ఎదుర్కొంటున్న సమస్యలను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధులకు వివరించారు. ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వహించుకునే పరిస్థితులు కల్పించాలని, అదనపు పనిభారం తగ్గించాలని కోరారు.
పదవీ విరమణకు ముందు కనీసం పది రోజుల పాటు డ్రైవర్లకు ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని డ్రైవింగ్‌కు బదులుగా కూర్చొని నిర్వహించగలిగే తేలికపాటి విధులు కేటాయించాలని ఉద్యోగులు కోరారు. అయితే సోమవారం పదవీ విరమణ చేయాల్సిన లక్ష్మణ్ అనే డ్రైవర్‌ను పదవీ విరమణకు కేవలం కొద్ది రోజుల ముందు కూడా విధులకు పంపించారని వారు తెలిపారు.
ఇప్పటికే గుండె సంబంధిత సమస్యతో స్టెంట్ అమర్చిన లక్ష్మణ్‌ను విధులకు పంపించడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్న సమయంలో పరిస్థితిని గమనించి బస్సును పక్కకు నిలిపి ప్రాణాపాయం తప్పించారని ఉద్యోగులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా కోరింది.
అదేవిధంగా వ్యక్తిగత కక్షలు, వేధింపుల కారణంగా ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని కొండల రాజేందర్ కుమార్ తెలిపారు. ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
“ఆర్టీసీ ఉద్యోగులకు ఏ విధమైన అన్యాయం జరిగినా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా అండగా ఉంటుంది. ఉద్యోగుల హక్కులు, ఆరోగ్యం, భద్రత పరిరక్షణ కోసం చట్టపరంగా పోరాడుతాం. ఉద్యోగులు ఎలాంటి సమస్య ఉన్నా నిర్భయంగా మా దృష్టికి తీసుకురావాలి” అని కొండల రాజేందర్ కుమార్ అన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఆరిఫ్ అలీ, అంబాల నరేశ్, తాండ్ర శ్రీనివాస్, సాగర్, ప్రశాంత్,సైమన్, లింగమూర్తి,మహేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు. జగిత్యాల ఆర్టీసీ డిపోకు చెందిన పలువురు డ్రైవర్లు, కండక్టర్లు కూడా పాల్గొని తమ సమస్యలను వివరించారు.